: ఏ రాష్ట్రానికి సీఎం అవుతానన్నది కాలం నిర్ణయిస్తుంది: నారా లోకేష్
టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్న యువనేత నారా లోకేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్ర కాదు... తెలంగాణ కాదు... హైదరాబాదీ అని ఆయన అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. అంతేకాకుండా, చంద్రబాబు కేవలం ఇంటి వద్ద మాత్రమే తనకు డాడీ అని... బయటకు వచ్చేసరికి ఆయన తనకు నాయకుడేనని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యాఖ్యానిస్తూ... ఏపీలో మరో పదేళ్ల వరకు చంద్రబాబే సీఎం గా ఉంటారని... తెలంగాణలో పలువురు సీనియర్ నేతలున్నారని... తాను ముఖ్యమంత్రి అవుతానని భావించడం లేదని అన్నారు. ఒకవేళ సీఎం అయ్యే అవకాశం వస్తే ఎక్కడ నుంచి అవుతారని ప్రశ్నించగా... చిరునవ్వు నవ్వి... దీనికి కాలమే సమాధానం చెబుతుందని తెలిపారు. హైదరాబాదులో ఓటు హక్కు కలిగిన వ్యక్తిగా ఇక్కడి ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం తనకు ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.