: భార్యను చంపబోయి తానే చచ్చాడు!
భార్యతో తీవ్ర విభేదాల నేపథ్యంలో ఆమెను చంపేయాలనుకున్నాడో కిరాతకుడు. ఆ ప్రయత్నంలో చివరికి అతనే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా వాసి వినయ్ కుమార్ కు దేవ్ కాలి గ్రామానికి చెందిన షాలినితో వివాహమైంది. గొడవల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భార్యపై పగ పెంచుకున్న వినయ్ ఆమెను చంపేయాలన్న నిర్ణయానికొచ్చాడు. నాటు బాంబులు తీసుకుని షాలిని స్వగ్రామం దేవ్ కాలి చేరుకున్నాడు. నేరుగా భార్య ఇంటి వద్దకు వెళ్ళి రెండు బాంబులు విసిరాడు. వాటిలో ఒకటి గోడకు తగిలి పేలగా, మరోటి పేలలేదు. దీంతో, షాలిని కుటుంబ సభ్యులు వినయ్ ని పట్టుకునేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగందుకోగా, కిందపడిపోయాడు. దీంతో, అతని జేబులో ఉన్న నాటు బాంబు పేలింది. తీవ్రగాయాలైన వినయ్ అక్కడిక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.