: 'జియోమీ' మొబైళ్లు వాడకండి... డేటా మొత్తం చైనాకు చేరుతుంది: వాయుసేన హెచ్చరిక
చైనీస్ తయారీ జియోమీ ఫోన్లను వాడకండని తన సిబ్బందిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెచ్చరించింది. ఈ ఫోన్లు వాడే వారి సమాచారం నేరుగా బీజింగ్ (చైనా)లోని సర్వర్లలోకి వెళుతోందని తెలిపింది. ఈ ఫోన్లను వాడితే... వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ బుక్ లోని ఫోన్ నంబర్లు, ఐఎంఈఐ నెంబర్, మెసేజ్ లు ఇవన్నీ చైనాకు చేరిపోతాయి. ఎఫ్-సెక్యూర్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ఇటీవలే జియోమీ రెడ్మీ 1ఎస్ స్మార్ట్ ఫోన్లపై పరీక్షలు నిర్వహించింది. ఫోన్లో ఉన్న డేటా మొత్తం చైనా సర్వర్లకు వెళ్లిపోతోందని ఈ పరీక్షల్లో తేలింది. దీంతో, వాయుసేన అప్రమత్తమైంది. తన సిబ్బంది ఈ ఫోన్లను వాడితే... రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం కూడా చైనాకు చేరే అవకాశం ఉందని వాయుసేన ఈ హెచ్చరికలు జారీ చేసింది.