: కోజికోడ్ లో యువ మోర్చా నేతల వీరంగం... కాఫీ షాప్ ధ్వంసం
కేరళ నగరం కోజీకోడ్ లో ‘డౌన్ టౌన్’ కాఫీ షాప్ తెలియని వారుండరు. రాత్రి పొద్దుపోయే దాకా తెరచి ఉండే ఈ కాఫీ షాప్, ప్రేమ పక్షులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ అంశమే బీజేపీ యువజన విభాగం 'యువ మోర్చా'ను ఆగ్రహావేశాలకు గురి చేసింది. అంతే, గురువారం రాత్రి ఆ కాఫీ షాప్ పై యువ మోర్చా కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు మూకుమ్మడి దాడి చేశారు. కాఫీ షాప్ ను ధ్వంసం చేశారు. వారంతా బీజేపీ జెండాలు చేతబట్టి మరీ దాడిలో పాల్గొనడం విశేషం. దీనిపై కాఫీ షాప్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ట్విట్టర్ లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఏవో కొన్ని అసాంఘిక కార్యక్రమాల పేర్లు చెప్పి బీజేపీ ఎలాంటి దాడులకు దిగుతోందో చూడండి’ అంటూ ఆయన సదరు దాడిపై స్పందించారు.