: ‘ఆళ్లగడ్డ’ నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో సమాప్తం
ఆళ్లగడ్డ ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు బరిలో ఉన్నారు. తొలుత ఈ స్థానానికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లలో వివరాల వెల్లడిలో సదరు అభ్యర్థులు పొరపాటు చేసిన కారణంగానే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అకాల మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉపఎన్నికలో అభ్యర్థులను నిలపరాదని అధికార టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు నేటి సాయంత్రంలోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే, అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. లేని పక్షంలో వచ్చే నెల 8న ఆ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.