: షూమాకర్ అభిమానులకు శుభవార్త
స్కీయింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ తలకు బలమైన దెబ్బ తగలడంతో ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం మైకేల్ షూమాకర్ ఇంకా కోమాలోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, షూమాకర్ త్వరలోనే కోమా నుంచి బయటికొస్తాడంటున్నారు అతనికి చికిత్సను అందిస్తున్న విఖ్యాత ఫ్రెంచ్ ఫిజీషియన్ జీన్ ఫ్రాంకోయిస్ పాయెన్. మరో మూడేళ్ళలో షూమాకర్ పూర్తిగా కోలుకుంటాడని కూడా ఆయన చెప్పారు. పాయెన్ ఆర్నెల్లుగా షూమాకర్ కు చికిత్స అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో షూమాకర్ తన కుమారుడితో కలిసి ఆల్ప్స్ పర్వత శ్రేణిలో స్కీయింగ్ చేస్తుండగా, అదుపుతప్పి ఓ రాతిపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. అతను ధరించిన హెల్మెట్ కూడా విరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు, దెబ్బ ఎంత బలంగా తగిలిందో! తీవ్రంగా శ్రమించిన మీదట వైద్యులు షూమాకర్ ను ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు. అప్పటినుంచి ఈ రేసింగ్ లెజెండ్ కోమాలోనే ఉన్నాడు. తాజాగా, స్విట్జర్లాండ్ లోని షూమాకర్ నివాసానికి వెళ్ళారు పాయెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలకు పెద్ద దెబ్బ తగిలినప్పుడు దశలవారీగానే కోలుకుంటారని అభిప్రాయపడ్డారు.