: భారత్ లో హిందువులు, ముస్లింలకు మధ్య ఆ మూడు వివాదాలే ఉన్నాయి: విశ్వహిందూ పరిషత్
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారతీయ ముస్లింలు ముందుకు వచ్చి సహకరించాలని విశ్వహిందూ పరిషత్ అగ్ర నాయకుడు అశోక్ సింఘాల్ వ్యాఖ్యానించారు. రామమందిర నిర్మాణం ముస్లిం మతానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. హిందువులకూ, ముస్లింలకూ మధ్య అయోధ్య, కాశీ, మధుర వివాదాలు మినహా మరే వివాదాలు లేవన్న సంగతిని వారు గుర్తించాలని ఆయన అన్నారు. ఈ మూడు పవిత్ర నగరాలలోని హిందువుల ప్రార్థన స్థలాలపై ముస్లింలు ఇంతకాలంగా అనుభవిస్తూ వచ్చిన తప్పుడు హక్కును స్వచ్ఛందంగా వదులుకుని, భారతదేశంలో మెజారిటీ మతస్థులైన హిందువుల పూజా కార్యక్రమాల హక్కును వారు గౌరవించాలని పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తే, ముస్లింలు ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వారవుతారని అశోక్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ మూడు సమస్యల పరిష్కారాల విషయంలో ముస్లింలు సహకరిస్తే... భారతదేశంలో హిందు, ముస్లింల మధ్య సంబంధాలు బాగా బలపడతాయని, మరే వివాదాలు ఉండవని ఆయన వెల్లడించారు.