: మేం కాపురాలు చేయలేకపోవడానికి చంద్రబాబే కారణం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సరికొత్త తరహాలో విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు సంబంధించి చంద్రబాబు నిన్న మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు కాపురం చేయకపోయినా... దానికి బాధ్యుడిని కూడా తానే అనేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై జీవన్ రెడ్డి స్పందించారు. తమ సంసారాలకు చంద్రబాబు అడ్డంకిగా మారారని ఆయన విమర్శించారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా చేసి... కరెంట్ కోతలతో తమకు రాత్రుళ్లు నిద్ర కరవయ్యేలా చంద్రబాబు కుట్ర పన్నారని... ఈ కారణంగా, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కాపురాలు చేయలేకపోవడానికి చంద్రబాబే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని... ఆయనకు ఉన్నది ముందు చూపు కాదని, కుట్ర చూపని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నా తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబును ప్రశ్నించలేకపోతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.