: పిల్లలకు పెద్దలు క్షమాపణ చెప్పే తీరిది


ఒక్కోసారి కోపగించుకున్న కారణంగానో, వారు అడిగినవి తెచ్చివ్వకపోవడం మూలానో, పిల్లలు అలకబూనుతారు. మనం వారిని ఊరడించడానికి ప్రయత్నిస్తాం. అయితే, వారు అందుకు ఓ పట్టాన అంగీకరించరు. అప్పుడు తల్లిదండ్రులు వారికి సారీ చెబుతారు. అయినా కొందరు అలక వీడరు. ఈ సమయంలో పిల్లలతో ఎలా వ్యవహరించాలో నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. మనం ఎందుకు కోప్పడాల్సి వచ్చిందో, లేక, ఎందుకు అడిగినవి తెచ్చివ్వలేకపోయామో వివరించాలి. ఒకవేళ, స్కూలు ఫంక్షన్ కు హాజరుకాలేకపోయామనుకోండి, ఎందుకు రాలేకపోయామన్నది అర్థమయ్యేట్టు చెప్పాలి. కొన్ని సందర్భాల్లో, చుట్టూ ఎవరున్నారో చూడకుండా కోపంతో వారిపై ఇంతెత్తున లేస్తాం! అలాంటప్పుడు అందరిముందూ తిట్టడం తప్పేనంటూ సారీ చెప్పాలి. నువ్వు అలా బాధపడతావని అనుకోలేదు అంటూ వారి కోపాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. నిజం తెలుసుకోకుండా కోప్పడ్డానని, నిన్ను వివరణ అడక్కుండా కోపగించుకోవడం తప్పేనని వారికి అపాలజీ చెప్పాలి. ఇక, తల్లిదండ్రులు కూడా తమను తాము సమీక్షించుకోవాలి. పిల్లలను వారి స్నేహితుల ముందే కోప్పడడం, లేక, పిల్లల బర్త్ డేలు మర్చిపోవడం తమ తప్పేనన్న విషయం గ్రహించాలి. మీ తప్పు మీ చిన్నారిని ఎలా బాధించిందో అడగండి. మీ చర్య బాధ కలిగించిందా? లేక, కోపం తెప్పించిందా? అన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పులను మరోసారి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. పని ఒత్తిడి, నిద్రలేమి తాలూకు చికాకులను పిల్లలపై చూపుతుంటే, అందుకు తరుణోపాయాలను ఆలోచించాలి. అయితే, కొన్ని సందర్భాల్లో పిల్లల ముందు చులకన అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలా చులకన కాకూడదంటే ఇలా వ్యవహరించాలి. పిల్లలను క్షమించమని ప్రాధేయపడకూడదు. కన్నీళ్ళు పెట్టుకోకూడదు. సారీ చెప్పే క్రమంలో మీరు ఎమోషనల్ గా ఫీలైనా, ఏడవకూడదు. నిజంగా పిల్లలే తప్పు చేసి ఉంటే వారికి క్షమాపణ చెప్పకూడదు.

  • Loading...

More Telugu News