: తనకు కేంద్ర కేబినెట్ హోదా ఉందంటూ పోలీసులనే బురిడీ కొట్టించాడు!


తాను హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ అని, తనకు కేంద్ర కేబినెట్ మినిస్టర్ హోదా ఉందని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి పోలీసులను సైతం బురిడీ కొట్టించాడు. ఆ మాయగాడి మాటల గారడీకి పడిపోయిన పోలీసులు, మీరట్ లో ఓ ఫంక్షన్ కు వెళుతున్న అతడికి భారీ స్థాయిలో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. స్థానిక బీజేపీ నేతలకు అనుమానమొచ్చి ఆరా తీయగా, అసలు విషయం వెల్లడైంది. అతడి పేరు తంజీమ్ అబ్బాస్ అని, ఫలావాదా నివాసి అని తేలింది. దీనిపై స్థానిక బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర, కేంద్ర స్థాయి నేతలకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మైనారిటీ సెల్ కన్వీనర్ కువర్ బాసిత్ అలీ ఫలావాదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై, మీరట్ ట్రాఫిక్ ఎస్పీ పీకే తివారీ స్పందిస్తూ, తంజీమ్ కు ఎస్కార్ట్ కల్పించమని తమకు ఆదివారం నాడు ఫ్యాక్స్ లో ఆదేశాలు అందాయని, అందుకే తాము అతడికి ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. అయితే, అతడిపై ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్కార్ట్ ఉపసంహరించుకున్నామని చెప్పారు. తంజీమ్ ఓ పాత నేరస్తుడని పోలీసు విచారణలో తేలింది. రూ.25 లక్షల విలువైన మద్యం అక్రమరవాణా కేసులో జూన్ 18న అతడు జైలుకు కూడా వెళ్ళాడని ఫలావాదా పీఎస్ ఇన్ చార్జి అబ్దుల్ వాసిమ్ ఖాన్ తెలిపారు. తంజీమ్ కు భద్రత కల్పించిన అధికారులపై విచారణ జరిపించాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News