: ప్యాంటు పైకి మడిచి... చీపురు పట్టి... 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు సల్మాన్ చీపురు పట్టాడు. మంగళవారం నాడు ముంబయిలోని కర్జాత్ ప్రాంతంలో సన్నిహితులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశాడు. ప్యాంటు పైకి మడిచి, చీపురు పట్టిన సల్మాన్ చెత్తను తొలగించడమే కాకుండా, అక్కడి గోడలకు సున్నం కూడా వేశాడు. అంతేగాదు, ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 'మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు' అమీర్ ఖాన్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వీడియోకాన్ గ్రూపు అధిపతి ప్రదీప్ దూత్ తదితరులను నామినేట్ చేశాడు. తాను చీపురు పట్టిన ఫొటోలను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశాడు.