: పడుకున్న సింహాన్ని లేపొద్దు: కేసీఆర్ కు మోత్కుపల్లి వార్నింగ్


శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అంశం టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అగ్గి రాజేస్తోంది. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని ఆరోపిస్తూ... నల్గొండలోని టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో... టీటీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. హద్దుల్లో ఉండాలని... లేకపోతే, టీఆర్ఎస్ నేతల గుండెల్లో నిద్రపోతానని టీడీపీ కీలక నేత మోత్కుపల్లి హెచ్చరించారు. నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దని ఏకంగా సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ ను మోత్కుపల్లి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఏనాడైనా తెలంగాణలోని విద్యుత్ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా? అని మోత్కుపల్లి నిలదీశారు. చంద్రబాబుతో కేసీఆర్ ఎందుకు మాట్లాడేందుకు ప్రయత్నించరని ప్రశ్నించారు. మా పార్టీ కార్యాలయాలపై దాడి చేస్తే విద్యుత్ వస్తుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ పని చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ఒక అసమర్థుడు అనే విషయం తేలిపోయిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News