: హీరో అంటే ఇతడే... మంటలను సైతం లెక్కచేయలేదు!
వెండితెరపై కనిపించే హీరోలు ఎన్నెన్ని సాహసకృత్యాలు చేస్తారో తెలియందికాదు. ఒంటిచేత్తో వందమందినైనా మట్టుబెట్టడం తమకే సాధ్యం అన్న రీతిలో ఉంటాయి వారి పోరాటాలు! దూసుకువస్తున్న రైలును సైతం అరచేయి అడ్డంపెట్టి ఆపేస్తారు! అంతెత్తున ఎగురుతున్న విమానం/హెలికాప్టర్ లోంచి అమాంతం కిందికి దూకేస్తారు (ఒక్క దెబ్బ కూడా తగలదు). అందుకే అతడు హీరో. నిజజీవితంలోనూ అసాధ్యమనుకున్నవి సాధ్యం చేస్తే... అతడు రియల్ హీరో. ఇతనూ అలాంటి వాడే. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇంటి యజమాని లోపలే చిక్కుకుపోయాడు. బయట అతని కుమార్తె ఎవరైనా సహాయం చేయండంటూ అర్థిస్తోంది. అప్పటికింకా అగ్నిమాపక దళ సిబ్బంది, వైద్య సహాయక బృందాలు రాలేదు కూడా. ఇంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి నేరుగా మంటల్లో చిక్కుకున్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ ఇంటి యజమానిని తన భుజంపై మోసుకుని తీసుకువచ్చాడు. దీంతో, ఆ కుటుంబంతో పాటు అక్కడి వారందరూ ఊపిరిపీల్చుకున్నారు.