: ఎద్దులతో విద్యుదుత్పత్తి చేస్తున్న హైదరాబాదీ
భవిష్యత్తులో విద్యుత్ కొరత తీవ్రతరం అవుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో, సంప్రదాయేతర విధానాలపై ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన బత్తుల జగదీశ్ కూడా ఈ కోవలోకే వస్తారు. మాడాక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు యజమాని అయిన జగదీశ్ 'ఎద్దుల' సాయంతో విద్యుదుత్పత్తి చేస్తూ అందిరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఇందుకోసం ఆయన ఓ యంత్రం రూపొందించారు. దాని పేరు మజిల్ ఎనర్జీ ఎన్విరో మెషీన్ (ఎంఈఈఎం). ఈ యంత్రం మధ్యలో ఓ కాడి ఉంటుంది. దానికి రెండు వైపులా ఎద్దులను కడతారు. ఓ రకంగా చూస్తే ఇది నూనె గానుగ వంటిదే. అవి తిరుగుతూ ఉంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నమాట. దీని సాయంతో ఫ్యాన్లు, లైట్లే కాదు, 5 హెచ్ పీ మోటార్ ను సైతం పనిచేయించవచ్చు. ఈ యంత్రం ఖరీదు రూ.2 లక్షలు కాగా, దీని ఏర్పాటుకు 100 చదరపు గజాల స్థలం అవసరమవుతుంది. హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీన్ని ప్రదర్శించిన జగదీశ్ మాట్లాడుతూ, జీవాల పెంపకానికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఇది అనువుగా ఉంటుందని తెలిపారు. దీనికి సబ్సిడీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.