: దీపావళికి సెలవు కోరుతున్న పాక్ హిందువులు
ఈ నెల 23న దీపావళి పండుగకు సెలవు కావాలంటూ పాకిస్థాన్ లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ రోజు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని, పండుగ సందర్భంగా తమకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ హిందు కౌన్సిల్ పోషకుడు డాక్టర్ రమేశ్ కుమార్ వాంక్వానీతో బాటు, అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ, సెలవు ప్రకటించటం వలన సదరు కమ్యూనిటీకి సాయం చేసినవారవుతారన్నారు. అంతేగాక తాము పాకిస్థానీ దేశభక్తి కలవారమని, వార్షిక పండుగకు సెలవు పొందే హక్కు తమకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఈ విషయాన్ని తాను జాతీయ అసెంబ్లీలో లేవనెత్తుతానని వాంక్వానీ అంటున్నాడు. పాక్ లోని ఏ రాజకీయ పార్టీ కూడా మైనార్టీ కమ్యూనిటీల సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపడం లేదన్నారు. దీపావళికి అధికారికంగా మలేషియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్, సింగపూర్, ఫిజి, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సెలవు ఉందని... కానీ, ఆరోజు పాక్ లో హిందువులకు మాత్రం సెలవు లేదనీ అన్నారు.