: చంద్రబాబు వంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోరన్న సంగీత విద్వాంసుడు నేదునూరి


చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోరని ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేదునూరిని సీఎం చంద్రబాబు తరపున ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా పరకాల శాలువా కప్పి నేదునూరిని సన్మానించారు. తనపట్ల సర్కారు చూపిస్తున్న శ్రద్ధకు నేదునూరి కృతజ్ఞతలు తెలిపారు. నేదునూరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1927 అక్టోబర్ 10న జన్మించారు. చిన్ననాట తల్లి పాడే అష్టపదులు, కృతులు ఆయనపై ఎక్కువగా ప్రభావాన్ని చూపాయి. అలా సంగీతంపై మక్కువ పెంచుకున్న నేదునూరి 1940లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరారు. అక్కడ ద్వారం నర్సింగరావు నాయుడు వద్ద వయొలిన్, గాత్ర సంగీతంలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్న నేదునూరి, అనంతరం, కర్నాటక సంగీత దిగ్గజం శ్రీపాద పినాకపాణి వద్ద శిష్యరికం చేశారు. అక్కడి నుంచి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ ప్రస్థానం సాగించారు. తిరుపతిలో ఎస్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, విజయనగరం మహారాజా మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, సికింద్రాబాదు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గానూ సేవలందించారు. 1985లో జీవీఆర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజి ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. ఎన్నో అవార్డులు నేదునూరిని వరించాయి. ఆయన వద్ద శిష్యరికం చేసిన అనేకమంది తమ ప్రతిభతో కర్నాటక సంగీత యవనికపై కాంతులీనుతున్నారు.

  • Loading...

More Telugu News