: అక్రమ మైనింగ్...ఈసారి ఒడిశా వంతు!
ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలతో కర్ణాటకతో పాటు గోవా రాష్ట్రాల ప్రతిష్ఠ మంట గలిసింది. తాజాగా ఒడిశా కూడా అక్రమ మైనింగ్ కు అనుమతి మంజూరు చేసి ఆ రెండు రాష్ట్రాల తరహాలోనే అపఖ్యాతిని మూటగట్టుకోబోతోంది. సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ, ఒడిశాలో భారీ ఎత్తున ఇనుప ఖనిజం అక్రమంగా తరలిపోయిందని, తరలిపోతోందని తేల్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 187 మైనింగ్ కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఆ కమిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ప్రభుత్వానికి రూ.17 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కూడా ఆ కమిటి తేల్చింది. ఈ కమిటీ తన నివేదికను నేడు సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు కమిటీ చెబుతోంది. అయితే, నిబంధనల మేరకే రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.