: ఆళ్లగడ్డ బరిలో దిగుదాం: లోకేశ్ తో కర్నూలు తెలుగు తమ్ముళ్లు


ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరిలో దిగుదామంటూ కర్నూలు జిల్లా తెలుగు దేశం నేతలు పట్టుబడుతున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగరెడ్డి మృతి నేఫథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించారు. అయితే అప్పటికే ఎన్నికల ఏర్పాటు పూర్తి కావడంతో ఆమె చనిపోయినా, బరిలో వైఎస్సార్సీపీ తరఫున ఆమె అభ్యర్థత్వమే కొనసాగింది. ఎన్నికల్లో ఆమె గెలిచారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల 8న ఆళ్లగడ్డ ఉప ఎన్నికను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ, శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియను తమ అభ్యర్థిగా ప్రకటించింది. శుక్రవారం ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే, ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరిలో దిగితే తప్పక విజయం సాధిస్తామని జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాని నేపథ్యంలో నిన్నటిదాకా మిన్నకుండిపోయారు. తీరా ఇంకా ఆలస్యం చేస్తే, నామినేషన్ల గడువు కూడా ముగిసిపోతుంది. దీంతో జిల్లా నేతలు చినబాబు లోకేశ్ తో భేటీ అయ్యారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటి చేస్తామని ఈ సందర్భంగా తమ మనసులోని మాటను బయటపెట్టారు. పోటీకి గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి సిద్ధంగా ఉన్నారంటూ సూచించారు. దీంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై దృష్టి సారించిన లోకేశ్, విశాఖ నుంచి చంద్రబాబు రాగానే దీనిపై నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పారట. మరి దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News