: సుప్రసిద్ధ రచయిత రావూరి భరద్వాజకు 'జ్ఞాన్ పీఠ్'
సాహిత్యంలో అత్యున్నత అవార్డు జ్ఞాన్ పీఠ్.. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజను వరించింది. ఆయన రచించిన 'పాకుడు రాళ్ళు' నవలకు గాను ఈ పురస్కారం దక్కింది. 'పాకుడు రాళ్ళు' నవలలో సినీ ప్రపంచం లోతుపాతుల గురించి ప్రతిభావంతంగా చర్చించారు భరద్వాజ.భరద్వాజ ఇప్పటివరకు మొత్తం 185 పుస్తకాలను రచించారు. భరద్వాజ 24 చిన్న కథల సంపుటాలు, పలు రేడియో నాటికలతో పాటు చిన్న పిల్లల సాహిత్యాన్ని కూడా సృజించారు. 'జీవన సమరం' నవల కూడా భరద్వాజ రచనల్లో మరో ముఖ్యమైన పుస్తకం.
కాగా, మన రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన వారిలో భరద్వాజ మూడో వ్యక్తి. ఇంతకుముందు విశ్వనాథ సత్యనారాయణ (వేయి పడగలు), సి.నారాయణ రెడ్డి (విశ్వంభర) జ్ఞాన్ పీఠ్ అందుకున్నారు.
భరద్వాజ 1927 లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. తన 17వ ఏటనే సాహితీ సేద్యానికి ఉపక్రమించి పలు ఆణిముత్యాలను రచించారు. ఈయనకు 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. భరద్వాజకు 1977లో నాగార్జున యూనివర్శిటీ, 1980లో జేఎన్ టీయూ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 1980లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి 'కళా ప్రపూర్ణ' అందుకున్న భరద్వాజను 1983లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు సైతం వరించింది. తన జీవన ప్రస్థానంలో భాగంగా జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, చిత్రసీమ వంటి పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన భరద్వాజ 1959లో ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా చేరారు.