: మీరు రెడీగా ఉండండి...నేనున్నాను: మోడీ
ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సైనికబలగాల ఉన్నతస్థాయి కమాండర్ల సంయుక్త వార్షిక సదస్సు భేటీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, శత్రువులు కనిపించకపోయినా, ముప్పు పొంచి ఉంటుందని అన్నారు. అందుకే అన్ని విధాలుగా త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. దాక్కుని పోరాడే శత్రువును ఎదుర్కొనేందుకు ప్రతిఘటనా శక్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు. అలా చేస్తే శత్రువు వైఖరిలో మార్పు వస్తుందని ఆయన సూచించారు. రోజురోజుకీ మారుతున్న ప్రాధామ్యాల నేపథ్యంలో భద్రతా సవాళ్లనుముందుగా పసిగట్టడం సాధ్యం కావడం లేదని పేర్కొన్న ఆయన, దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే భద్రత, శాంతియుత వాతావరణం అవసరమని అన్నారు. తన ప్రభుత్వ ప్రధమ లక్ష్యాల్లో దేశ భద్రత అగ్రభాగాన ఉందని ఆయన పేర్కొన్నారు. భారత బలగాల ఆధునికీకరణ, రక్షణ పరికరాలు సమకూర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ సైన్యాన్ని చూడాలనుకుంటున్నానని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత బలగాల శక్తిసామర్థ్యాలు గొప్పవని శ్లాఘించిన ఆయన, సైనికులకు ‘ఒక ర్యాంకు-ఒక పింఛను’ వంటి హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.