: భాగస్వామితో తగవులో ఈ అంశాలు ప్రస్తావించొద్దు!


స్నేహితుల మధ్య, దంపతుల మధ్య తగవులు సాధారణం! ఏదో ఒక విషయంలో పంతాలకు పోయి, కీచులాడుకుంటారు. ఎంతటి ఆరోగ్యకరమైన బంధమైనా భేదాభిప్రాయాలు సహజం. అయితే, గొడవ తీవ్రరూపం దాల్చకుండా ఉండాలంటే వ్యక్తులు ఐదు అంశాలను ప్రస్తావించకూడదు. ఏదైనా మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోలేం. నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాననో, లేక, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాననో అన్న తర్వాత మీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండదు. ఒకవేళ పొరబాటున ఆవేశంలో అనేస్తే, వెంటనే క్షమాపణ కోరడం మంచిది. మరోసారి అలా జరగదని భాగస్వామికి సంజాయిషీ ఇవ్వాలి. ఆమెకు బంధంపై నమ్మకం కలిగించాలి. కొందరు తగవులాడుకున్న తర్వాత మౌనాన్ని ఆశ్రయిస్తారు. అప్పుడు అవతలి వ్యక్తి, నాతో మాట్లాడాల్సిందే అంటూ పట్టుబట్టడం చాలా ఘటనల్లో జరుగుతుంది. అలాంటప్పుడు కాసేపు కూర్చుని ఆలోచించుకోవడం మంచిదే. ఆత్మ పరిశీలన చేసుకున్న అనంతరం, లోటుపాట్ల గురించి చర్చించుకోవాలి. నువ్వో చవటవి, దద్దమ్మవి అంటూ వ్యక్తిగత దూషణలకు దిగొద్దు. దీంతో, సమస్య పక్కదారి పడుతుంది. తగవు సందర్బంగా భాగస్వామిని ఇతరులతో పోల్చడం కూడా అదే రీతిలో ప్రభావం చూపిస్తుంది. గొడవపడ్డప్పుడు ఎదుటివారిని ఆక్షేపించడం సాధారణం. సమస్య ఎలాంటిదైనా, తప్పంతా నీదే అన్నట్టుగా మాట్లాడడం సరికాదు. అలాంటి వైఖరితో సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు కూడా. పైపెచ్చు మళ్ళీ మొదటికే వస్తుంది. ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం కంటే, సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం ఉత్తమం. ఎదుటి వ్యక్తి ప్రవర్తన మిమ్మల్ని ఎంత గాయపరిచిందో నిదానంగా విడమర్చాలి. కొందరు గొడవల సందర్భంగా రంధ్రాన్వేషణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కిందటిసారి కూడా నువ్వు ఇలాంటి తప్పే చేశావు అంటూ విమర్శలకు దిగుతారు. గతాన్ని తవ్వుకుంటే సమస్య సమసిపోదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని ఎదుటి వ్యక్తిలో నమ్మకం కలిగించేలా మాట్లాడాలి.

  • Loading...

More Telugu News