: విశాఖ మళ్లీ ఆర్థిక రాజధానిగా నిలుస్తుంది: చంద్రబాబు
తుపాను ధాటికి పూర్తిగా రూపురేఖలు మారిన విశాఖ నగరం మళ్లీ ఆర్థిక రాజధానిగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలు చాలా మంచివాళ్లని, ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రజలు చెబుతున్నారని బాబు అన్నారు. విశాఖ కలెక్టరేట్ లో ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే పరిహారం వెళుతుందని వెల్లడించారు. హుద్ హుద్ పోర్టల్ కు తుపాను నష్టం వివరాలను వీడియోలు, ఫోటోలు తీసి పంపాలని కోరారు. సాయంత్రంలోగా చెత్త తొలగింపు పనులు పూర్తవుతాయని, బాధితులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇక టెలికాం కంపెనీల బాధితులకు రూ.50 ఉచిత టాక్ టైం, రోమింగ్ అందించాయని బాబు చెప్పారు. నష్టపోయిన పరిశ్రమలకు భీమా కంపెనీలు పరిహారం చెల్లించాలని మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎల్లుండి విశాఖకు వచ్చి ఏం చూస్తారని అడిగారు. ప్రభుత్వం ఏం చేసిందో ప్రతిపక్షం, ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు.