: సిగరెట్ 'నుసి'కి చాలా పవరుంది!
సిగరెట్ వెలిగించినప్పుడు వచ్చే నుసికి రసాయన ధర్మం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ నుసి చెడు నీటిలో ఉండే ఆర్సెనిక్ విష పదార్ధాన్ని సమర్థవంతంగా తొలగిస్తుందని జియాగ్జింగ్ లీ అనే పరిశోధకుడు తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతాల్లో నీటి నుంచి ఆర్సెనిక్ ను తొలగించేందుకు అనుసరిస్తున్న విధానాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. వాటిని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం కష్టం కూడా. కానీ, జియాగ్జింగ్ లీ బృందం స్వల్ప వ్యయంతో నీటి నుంచి ఆర్సెనిక్ ను వేరు చేసే ప్రక్రియను రూపొందించింది. ప్రయోగాల్లో భాగంగా సిగరెట్ నుసికి అల్యూమినియం ఆక్సైడ్ కోటింగ్ ఇచ్చి, ఆ నుసిని కలుషిత నీటిలో కలిపారు. ఆ మిశ్రమం నీటిలోని ఆర్సెనిక్ ను 96 శాతం తొలగించిందట. నీటిలో ఆర్సెనిక్ శాతం ఎంత ఉండాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాల కన్నా తక్కువకే పరిమితం చేసిందట ఈ సిగరెట్ నుసి. జియాగ్జింగ్ లీ దీని గురించి వివరిస్తూ... సిగరెట్ తాగిన తర్వాత దాన్ని పడేస్తారని, బహిరంగంగా ధూమపానం అమల్లో ఉన్న దేశాల్లో ఇలా తాగి పారేసిన సిగరెట్లును సేకరించడం సులువేనని చెప్పారు. ఆ సిగరెట్లను నుసి చేసి, నీటిని శుద్ధి చేసుకోవడంలో వినియోగించుకోవచ్చని వివరించారు. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యకు ఇది చవకైన పరిష్కార మార్గమని తెలిపారు. కాగా, కొందరు శాస్త్రవేత్తలు నీటి నుంచి ఆర్సెనిక్ ను వేరు చేసేందుకు అరటి తొక్కలు, వరిపొట్టు వినియోగించారు. కానీ, ఆయా విధానాలు పరిమిత స్థాయిలోనే విజయవంతం అయ్యాయి.