: టీమిండియాకు వాట్సన్ హెచ్చరిక
ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా, అప్పుడే మాటలయుద్ధం మొదలైంది. భారత్ కు భంగపాటు తప్పదని స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ హెచ్చరిస్తున్నాడు. ధోనీ సేనకు బౌన్సీ పిచ్ లు స్వాగతం పలుకుతాయని అంటున్నాడు. ఈ మేరకు పేస్ కు అనుకూలించే పిచ్ లే తయారుచేయాలని క్యూరేటర్లను కోరాడు. 2013లో భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ కు 0-4తో వైట్ వాష్ తప్పలేదు. అప్పుడు స్పిన్ పిచ్ లు తయారు చేసి తమను ఓడించారని, అందుకే, తామిప్పుడు ఫాస్ట్, బౌన్సీ పిచ్ లు రూపొందించి దెబ్బకుదెబ్బ తీస్తామని వాట్సన్ అన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన వాట్సన్ మళ్ళీ జట్టులోకొచ్చాడు. సిడ్నీ రేడియో స్టేషన్ '2జీబీ'తో మాట్లాడుతూ, భారత జట్టులో ఎందరో ప్రపంచస్థాయి బ్యాట్స్ మెన్ ఉన్నారని, అయితే, వారిక్కడ విభిన్నమైన సవాల్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.