: సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమయింది: రఘువీరా, బొత్స
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నగరశుద్ధి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్టాడుతూ, టీడీపీ ప్రభుత్వం తుపాను బారిన పడిన ఏ ఒక్కరికీ అండగా నిలవలేక పోయిందని ఆరోపించారు. కనీసం మంచి నీరు కూడా సరఫరా చేయలేకపోయిందని మండిపడ్డారు. తుపాను ధాటికి ఎంతమంది మరణించారన్న లెక్కలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదని రఘువీరా అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని అన్నారు. ఈ నెల 19న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.