: 2జీ కేసు వివరాలపై ఏ రాజా పుస్తకం!
యూపీఏ పాలనలో దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన 2జీ స్పెక్ట్రం కేసు వివరాలు, అందులో ప్రభుత్వ పాత్ర ఎంత, ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, దర్యాప్తు సాగిన తీరు, కోర్టు విచారణ శైలి తదితర సమగ్ర వివరాలతో కూడిన ఓ పుస్తకం మన ముందుకు రాబోతోంది. ఇందులోని విషయాల్లో ఇసుమంత కల్పితం కూడా ఉండదట. ఎందుకంటే ఆ పుస్తకం రాస్తోంది ఎరవో కాదు, కేసులో కీలక నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా! కేసు సందర్భంగా తాను ఎదుర్కొన్న ఒత్తడి, తనపై వెల్లువెత్తిన ఆరోపణలు, వాటి ఫలితంగా తాను అనుభవించిన యాతన, సీబీఐ దర్యాప్తు, కోర్టు విచారణ జరిగిన తీరు తదితరాలను ఆయన సమగ్రంగా గ్రంధస్థం చేయనున్నారని వినికిడి. పుస్తక రచనకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న రాజా, పుస్తక ప్రచురణకు సంబంధించిన విషయాలపైనా పలువురు ప్రచురణకర్తలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి చేశారట. కేసులో ప్రధాన విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ప్రథమార్థంలో తీర్పు వెలువరించనుంది. అప్పటిదాకా ఖాళీగా ఎందుకుండాలనుకున్నారేమో, రాజా పుస్తక రచనకు పూనుకున్నారు. మరి ఆయన పుస్తకం ఏ తరహా రికార్డులను సృష్టిస్తుందో చూద్దాం.