: హర్యానా బరిలో రికార్డు స్థాయిలో మహిళల పోటీ!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత మంది మహిళలు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా మహిళలకు అత్యధికంగా టికెట్లను కేటాయించాయి. దీంతో నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ లో మొత్తం 109 మంది మహిళా అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. హర్యానా అసెంబ్లీ బరిలో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పోటీ పడుతుండటం ఇదే తొలిసారి. ఎగ్జిట్ పోల్స్ లో దూసుకెళుతున్న బీజేపీ 15 సీట్లను మహిళలకు కేటాయించింది. వీరిలో 12 మంది రాజకీయాలకే కొత్తవారు కావడం గమనార్హం. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఐఎన్ఎల్ డీ కూడా సాధ్యమైనన్ని సీట్లను మహిళలకు కేటాయించింది. తాజా బరిలో సుష్మా స్వరాజ్ సోదరి వందనా శర్మ బీజేపీ తరఫున బరిలో నిలవగా కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ఉద్ధండులుగా పేరుగాంచిన బీరేంద్ర సింగ్, అజయ్ సింగ్ చౌతాలా, కుల్దీప్ బిష్ణోయ్ లు తమ సతీమణులను బరిలోకి దించారు. రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో మహిళలకు మరిన్ని సీట్లను కేటాయించడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకే పార్టీలు ఈ తరహాలో సీట్లను కేటాయించాయన్న వదంతులు వినిపిస్తున్నాయి.