: కాంగ్రెస్ లో చివరికి సోనియా, రాహుల్ లే మిగులుతారు: బీజేపీ


ప్రధాని నరేంద్ర మోడీని పొగిడిన కారణంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి కోల్పోయిన శశిథరూర్ వ్యవహారంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ఈ పధ్ధతి ఇలాగే కొనసాగితే, త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలిపోయే పరిస్థితి వస్తుంది’’ అని బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లను ప్రస్తావించిన మోడీ, అందులో శశిథరూర్ పేరునూ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శశిథరూర్, మోడీని ఆకాశానికెత్తేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ‘‘పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న నేత వ్యక్తిగత అభిప్రాయాలను ఎలా వెల్లడిస్తారు?’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, పార్టీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘‘మంచి పని ఎవరు చేసినా వారిని పొగడడంలో తప్పేముంది? క్లీన్ ఇండియాను మహాత్మా గాంధీ ప్రారంభిస్తే, మోడీని పొగిడిన వారిని కాంగ్రెస్ తుడిచిపెట్టేస్తోంది’’అని ఆజాద్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News