: నాలుగేళ్ళ పాటు కనిపించకుండా పోయిన చిలుక స్పానిష్ నేర్చుకొచ్చింది!
మనుషులు పలికే పదాలను చిలుకలు కూడా పలుకుతాయన్న సంగతి తెలిసిందే. వివిధ భాషల్లోని పదాలు వాటినోట వినడానికి ఎంతో ముద్దుగా ఉంటాయి. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన డారెన్ చిక్ అనే వ్యక్తి ఆఫ్రికన్ గ్రే రకానికి చెందిన ఓ చిలుకను ఎంతో ముచ్చటపడి పెంచుకోసాగాడు. దాని పేరు నిగెల్. అది బ్రిటీష్ యాసలో ఇంగ్లీషు పదాలను పలుకుతుంది. నాలుగేళ్ళ క్రితం అది కనిపించకుండా పోయింది. ఇటీవలే అది టోరన్స్ సిటీలోని ఓ దంపతుల పెరట్లో కనిపించింది. టెరెసా మికో అనే వెటర్నరీ టెక్నీషియన్ తన చిలుక కనిపించడంలేదంటూ పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసిన ఆ దంపతులు, ఈ చిలుక ఆమెదే అని భావించారు. దాన్ని పట్టుకుని టెరెసాకు అప్పగించారు. అయితే, ఆమె ఆ చిలుక తనది కాదని వెంటనే గుర్తించింది. చిలుకల విక్రయాల రికార్డులను పరిశీలించగా అది చిక్ దని తేలింది. తీసుకెళ్ళి చిక్ కు అప్పగించింది దాన్ని. దీంతో, సంబరపడిపోయాడు చిక్. అయితే, ఆ చిలుక ఈ నాలుగేళ్ల కాలంలోనూ స్పానిష్ నేర్చేసుకుంది. అది చక్కని స్పానిష్ లో మాట్లాడుతూ లారీ అనే వ్యక్తి గురించి వాకబు చేస్తుండడం పట్ల అతడు ఆశ్చర్యపోయాడు. "ఈ చిలుకను చూసిన క్షణం నుంచే ఇది నాదేనని నిర్ధారించుకున్నా" అని తెలిపాడు. కాగా, నాలుగేళ్ళ తర్వాత కనిపించిన తన చిలుకను చూసి చిక్ స్టన్నయిపోయాడని 'డైలీ బ్రీజ్' దినపత్రిక పేర్కొంది.