: లీటర్ పెట్రోలు ధర రూ.100!
పెట్రోలు ధరలను కేంద్రం తగ్గిస్తే లీటర్ పెట్రోలు రూ.100 ఎందుకు? అనే అనుమానం వచ్చిందా? ఈ ధర కేవలం విశాఖ వాసులకే...హుదూద్ తుపాను ధాటికి దద్దరిల్లిన విశాఖపట్టణంలో నిత్యావసర సరకులు సహా అన్నీ నిండుకున్నాయి. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు రవాణా సౌకర్యం వెంటనే కల్పించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వ్యాపారులు విజృంభిస్తున్నారు. అందినకాడికి దండుకుని జేబులు నింపుకుంటున్నారు. దీంతో విశాఖలో లీటర్ పెట్రోలు 100 రూపాయలు పలుకుతోంది. మంచి నీరు కూడా ఉత్పత్తి చేసే వెసులుబాటు లేకపోవడంతో నీటి ధరకు కూడా రెక్కలొచ్చాయి. ఇంత తీవ్రతను ఊహించని ప్రజలు ఒకట్రెండు రోజులకు సరిపడా సరకులు నిల్వచేసుకోవడంతో నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రోజులు ఎలా వెళ్లదీయాలా అని విశాఖ వాసులు భయపడుతున్నారు.