: 'హుదూద్' తర్వాత శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఇలా తయారైంది!
శ్రీకాకుళం జిల్లాపై హుదూద్ తుపాను తీవ్ర ప్రభావమే చూపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులు పోటెత్తాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు కొనసాగితే శ్రీకాకుళానికి కూడా వరద ముప్పు తప్పదు. తీర ప్రాంతగ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో వేలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టెలిఫోన్, విద్యుత్, తాగునీటి సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వేలాది వృక్షాలు నేలకొరగ్గా, వాటిని తొలగించి రహదారులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మడ్డువలస రిజర్వాయరు జలకళతో తొణికిసలాడుతుండడంతో 1.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. మడ్డువలస రిజర్వాయర్ లోకి 80 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతోంది. మడ్డువలస డ్యాం లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.