: క్రీస్తు భారత్ వచ్చాడా?
క్రైస్తవం గురించి తెలిసిన వారెవరికైనా కొత్త నిబంధనల గ్రంథం, పాత నిబంధనల గ్రంథం గురించి తెలిసే ఉంటుంది. కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం క్రీస్తు జీవితంలో 18 ఏళ్ళను సైలెంట్ ఇయర్స్ (నిశ్శబ్ద సంవత్సరాలు)గా పరిగణిస్తారు. ఇందుకు భిన్నంగా, క్రీస్తు తన 12వ ఏట నుంచి 30వ ఏట వరకు గలీలీ ప్రాంతంలో ఓ వడ్రంగిగా పనిచేశాడని మరో వాదన. విషయం ఏమిటంటే... ఈ సుదీర్ఘ వ్యవధిలో క్రీస్తు భారత్ వచ్చాడంటూ కొందరు వాదిస్తున్నారు. మధ్యయుగం నాటి ఆర్థూరియన్ పురాణాల ప్రకారం యువ ఏసు బ్రిటన్ లో జీవించినట్టు ఒక వాదన. ఇక, 19వ, 20వ శతాబ్దాల నాటి సిద్ధాంతాలేమో ఏసు తన 12-30 ఏళ్ళ మధ్య కాలంలో భారత్ ను సందర్శించి ఉండవచ్చని, లేదా, జూడా ఎడారిలో అధ్యయనం సాగించి ఉంటాడని చెబుతున్నాయి. ఈ భిన్నవాదనలను సహజంగానే క్రైస్తవవాదులు కొట్టిపారేశారు. ఈ 18 ఏళ్ళ కాలంలో ఏసును గురించిన విషయాలు ఏవీ తెలియవని వారు చెబుతారు. ఫ్రెంచ్ జాతీయుడు లూయిస్ జకోలియట్ తన గ్రంథంలో శ్రీకృష్ణుడికి, జీసస్ కు మధ్య పోలిక తెచ్చాడు. ఏసు సువార్తను చాటితే, కృష్ణుడు గీతాసారాన్ని బోధించాడని వివరించాడు. మరికొందరు, జీసస్ పెద్దవాడైన తర్వాత ఈజిప్టు వెళ్ళి ఉంటాడని, లేక, భారత్ కు వెళ్ళి బౌద్ధమతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటాడని చెబుతున్నారు. అయితే, చారిత్రక ఆధారాల్లేని కారణంగా ఈ వాదనలను విశ్వసించలేని పరిస్థితి నెలకొంది.