: కుటుంబం చెంతకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ
హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరితను పోలీసులు ఎట్టకేలకు ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. భవ్యశ్రీ అదృశ్యంపై ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజులుగా పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. చివరకు భవ్యశ్రీ విశాఖలో ఉన్నట్టు నిర్ధారించుకుని అక్కడకు వెళ్లిన సైబరాబాద్ పోలీసులు, ఆమెను హైదరాబాద్ తీసుకుని వచ్చారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం భవ్యశ్రీని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో తొలుత కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా హైరానా పడ్డారు. భవ్యశ్రీ కిడ్నాప్ నకు గురయ్యారేమోనన్న అనుమానంతో ఆమె ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ముమ్మర గాలింపు చర్యల్లో భాగంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భవ్యశ్రీ ఆచూకీని కనుగొన్న పోలీసులు ఈ కేసును చేధించారు. అయితే కుటుంబ సభ్యులకు చెప్పాపెట్టకుండా భవ్యశ్రీ విశాఖ వెళ్లిన కారణం వెల్లడి కాలేదు.