: వాద్రా కోసం ఖేమ్కాను బలి చేస్తున్న హుడా సర్కారు!
పదవి నుంచి దిగిపోయేలోగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు లబ్ధి చేకూర్చి వెళ్లాల్సిందే. ఇది హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వ లక్ష్యం. అందులో ఎంత మంది జీవితాలు నాశనమైనా ఫరవాలేదు. ఈ నెల 15న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 19న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలిచి నిలిచిన పార్టీ ఈ నెల 20న రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడుతుంది. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఇక తాను తిరిగి అధికారంలోకి వస్తానో, రానోనన్న అనుమానం హుడాను పట్టి పీడిస్తోంది. అయితే అధినేత్రి చెప్పిన పని పూర్తి చేయకపోతే ఎలా? అందుకే హుడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వాద్రా భూ కేటాయింపులకు సంబంధించి విచారణాధికారిని నియమించేందుకు సర్వం సిద్ధం చేసింది. అంతేకాక విచారణలో ఏం చేయాలి? ఏ విధమైన తీర్పు ఇవ్వాలన్న విషయాలపై సదరు విచారణాధికారికి ముందే దిశానిర్దేశం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వాద్రా భూ వ్యవహారానికి గండికొట్టిన నిజాయతీ అధికారి అశోక్ ఖేమ్కా కెరీర్ నే బలిపెట్టేందుకు కూడా హుడా వెనుకాడటం లేదు. అసలు ఆయనపై దాఖలు చేసిన కేసుకు సంబంధించిన ఏ ఒక్క పత్రాన్ని కూడా ఖేమ్కాకు అందించకుండా మొండికేస్తోంది. ఇదేంటీ, నాపై నమోదైన కేసు వివరాలు తెలుసుకోకుండా నన్నెలా అడ్డుకుంటారన్న ఖేమ్కా అనుమానాలను నివృత్తి చేసేందుకు మొరాయిస్తోంది. దీంతో విషయం అర్థమైన ఖేమ్కా, హుడా సర్కారు తన కెరీర్ నే బలి తీసుకునేందుకు యత్నిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే హుడా సర్కారుకు ఖేమ్కా కెరీర్ కంటే, వాద్రాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం కదా. ఖేమ్కాను తప్పుబడితే, వాద్రాకు భూములను ఎంచక్కా రాసియొచ్చు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు. మరి హుడా ప్రభుత్వ పాచిక పారుతుందో, బెడిసికొట్టి హుడాతో పాటు సోనియా కుటుంబాన్ని వివాదంలోకి లాగుతుందో చూడాల్సిందే.