: రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపించిన బోనీ కపూర్


'సావిత్రి' సినిమా పేరు ప్రకటించి సంచలనం రేపిన రాంగోపాల్ వర్మ, తర్వాత దానిని 'శ్రీదేవి'గా మార్చి ఇప్పుడు కొత్త వివాదం కొని తెచ్చుకున్నారు. 'శ్రీదేవి' సినిమా టైటిల్ పై ప్రముఖ సినీ నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపించారు. శ్రీదేవి పేరును దుర్వినియోగం చేస్తున్నారని, దానిపై వివరణ అడిగాననీ, దానికి సమాధానంగా ప్రెస్ నోట్ ను ఫోటో తీసి వాట్సప్ లో పంపించారని ఆరోపిస్తూ బోనీకపూర్ వర్మకు లీగల్ నోటీస్ పంపించారు. శ్రీదేవికి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని, అభ్యంతరకరంగా ఉండే భావనను ప్రచార చిత్రాల్లో కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం సరికాదని ఆయన నోటీసులో పేర్కొన్నారు. గతంలో రాంగోపాల్ వర్మ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ, శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె భర్త బోనీని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నాడు. అందుకే తన సినిమాకి 'శ్రీదేవి' పేరు పెట్టాడా? అనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. నోటీసు అందిన మూడు రోజుల్లోగా స్పందించకపోతే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. 'శ్రీదేవి' సినిమా పేరు మారుస్తున్నట్టు లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన సూచించారు. అలాగే జాతీయ స్థాయి వార్తా పత్రికల్లో క్షమాపణలు చెబుతూ, ప్రకటన ఇవ్వాలని, కొత్త టైటిల్‌ కూడా ప్రకటించాలని ఆయన నోటీసులో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News