: చింతలపూడిలో నల్ల బంగారు గని: సింగరేణి బొగ్గు కంటే నాణ్యమైనదట!


చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఈ వార్త కొత్త జవసత్వాలను నింపేదే. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి లోయలో 3 వేల మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిక్షేపాలున్నాయట. ఈ బొగ్గును వెలికితీయడం మొదలు పెడితే ఏపీ భవిష్యత్తే మారిపోనుంది. ఒక్క విద్యుదుత్పత్తి రంగాన్నే కాక అనుబంధ రంగాలనూ ఈ గనుల వెలికితీతతో పరుగులు పెట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక సమాచారం ఉన్న ఏపీ సర్కారు గనుల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాసిందట. లక్నోకు చెందిన బీర్బల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పేలియోబోటనీకి చెందిన జియాలజిస్ట్ ఓం ప్రకాశ్ ఎస్ సరాతే జరిపిన పరిశోధన ఈ విషయాన్ని నిగ్గు తేల్చింది. ఈ అధ్యయనంపై పేలియంటాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్ లో 2013 డిసెంబర్ నాటి సంచికలో కథనం ప్రచురితమైంది. కృష్ణా జిల్లా సోమవరం నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దాకా విస్తరించి ఉన్న ఈ బొగ్గు నిక్షేపాలు భూమికి 500 మీటర్ల లోతున ఉన్నాయట. మరోవైపు సింగరేణి, తాల్చేరు గనుల్లో లభ్యమయ్యే గనుల్లోని బొగ్గు నాణ్యతతో పోలిస్తే, చింతలపూడి బొగ్గు ఎన్నో రెట్లు మెరుగైనదట. ఇంకేముంది, కేంద్రం నుంచి అనుమతి రావడమే తరువాయి, చింతలపూడి గనులను ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News