: అణ్వస్త్ర సంపత్తి ప్రస్తావనకు తెగబడిన పాక్!
కలహాల పొరుగు దేశం పాకిస్తాన్ మరోమారు తన నైజాన్ని చాటుకుంది. అణ్వస్త్ర సంపత్తి ఉన్న రెండు దేశాల మధ్య పొరపొచ్చాలు సరికావని హితవు పలుకుతూనే, తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ తో పాటు ప్రపంచ దేశాలు గుర్తించాలన్న చందంగా వ్యవహరించింది. ఈ మేరకు గురువారం ఆ దేశ రక్షణ శాఖ మంత్రి, ఫెడరల్ మంత్రులు వరుసగా అణ్వస్త్రాల ప్రస్తావనతో ఒక్కసారిగా కలకలం రేపారు. మరోవైపు కాశ్మీరీలకు తాము దౌత్య పరంగానే కాక రాజకీయంగానూ, నైతికంగానూ మద్దతు పలుకుతామని రెచ్చగొట్టింది. భారత దాడులను తిప్పికొట్టే సామర్థ్యం పాక్ కు ఉందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ అన్నారు. అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదని ఆయన సుతిమెత్తగానే మాట్లాడినా, తమ అణ్వస్త్ర సంపదను గుర్తు చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరోవైపు పాక్ వద్ద అణ్వస్త్రాలున్న వాస్తవాన్ని భారత్ గుర్తించాలని ఆ దేశ ఫెడరల్ మంత్రి అబ్దుల్ ఖాదిర్ బలోచ్ నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు.