: ఎస్సై చైర్లో కూర్చుని పోజిచ్చాడు... ఆనక అరెస్టయ్యాడు!
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి! అమీర్ ఖాన్ అనే వ్యక్తి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఓ రోజు పోలీస్ టోపీ పెట్టుకుని ఎస్సై చైర్లో సెటిలయ్యాడు. అంతేగాకుండా తన మిత్రుడు షెహజాద్ కు చెప్పి, ఓ ఫొటో కూడా తీయించుకున్నాడు. డోయివాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ టప్పర్ పోలీస్ పోస్టులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆన్ డ్యూటీ కానిస్టేబుల్ లలిత్ జోషి సమక్షంలోనే జరిగింది. అమీర్ ఖాన్ ఎస్సై టోపీ ధరించి దర్పం ప్రదర్శిస్తుండగా, యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అతని పక్కనే చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీంతో, పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అమీర్ ఖాన్ ను అరెస్టు చేశారు. అటు, అతడికి సహకరించిన కానిస్టేబుల్ లలిత్ జోషిని బదిలీ చేసి, శాఖాపరమైన విచారణ చేపట్టారు. పాపం, మిత్రుడి ఫొటో తీసిన షెహజాద్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరాఖండ్ అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) రామ్ సింగ్ మీనా తెలిపారీ వివరాలు.