: ఇకపై ఆలస్యంగా ఆఫీసుకొచ్చే కేంద్ర ఉద్యోగుల ఆటలు చెల్లవు!


కార్యాలయాలకు తామొచ్చిందే సరైన సమయమన్న రీతిలో, దేశ రాజధాని న్యూఢిల్లీలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తుండటం మనం చూస్తూనే వున్నాం. అయితే ఇకపై వారి ఆటలు చెల్లవు. మోడీ ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యల ప్రకారం ఇకపై వారు ఠంచనుగా కార్యాలయానికి చేరాల్సిందే. లేదంటే, ఆ రోజు వారు గైర్హాజరైనట్లే లెక్క. కొత్తగా అందుబాటులోకి రానున్న Attendance.gov.in వెబ్ సైట్ వీరి బాధ్యతారాహిత్యానికి కళ్లెం వేయనుంది. కొత్త విధానం ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాయాల్లో బయోమెట్రిక్ హాజరు యంత్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక కార్యాలయంలో పనిచేసే అధికారి మరో కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోనూ హాజరు వేసుకోవచ్చు. దీంతో అధికారులు వేళకు హాజరు కావడమే కాక, ఇతర పనుల నిమిత్తం వేరే కార్యాలయాలకు వెళ్లామని చెప్పే సాకులకు కూడా చెక్ పడనుంది. తాజా బయోమెట్రిక్ యంత్రాలకు ఉద్యోగుల ఆధార్ కార్డు నెంబర్లను అనుసంధానం చేయనున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగుల సమాచారం, హాజరును ఈ వెబ్ సైట్ ద్వారా పర్యవేక్షించే వెసులుబాటు లభించనుంది. అంతేకాక టీ బ్రేకులంటూ గంటల తరబడి కాలయాపన చేసే ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు నిఘా కెమెరాలు కూడా కార్యాలయాల్లో అమరనున్నాయి. అంటే, ఇకపై నిర్ణీత సమయం మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఒళ్లొంచి పనిచేస్తారన్న మాట. ఈ నెలాఖరులోగా ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులోకి రానున్న ఈ వ్యవస్థ, తదనంతరం దేశవ్యాప్తంగా అమలు కానుంది.

  • Loading...

More Telugu News