: ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడే కాదు, విద్యార్థి కూడా ఒక్కరే!


నిజమే, ఆ పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాలే. అయితే అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా ఒకటే. సదరు ఏక విద్యార్థి చదువుతున్న తరగతి కూడా ఒకటే. అయితే వసతుల విషయంలో మాత్రం మిగతా పాఠశాలల కంటే ఆ పాఠశాల ఎంతో మెరుగ్గా ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యనందించేందుకు ఏర్పాటైన ఆ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, పెద్ద వసారా, ఆట స్థలం, మరుగు దొడ్లు, రక్షిత మంచినీటితో పాటు ఆహ్లాదాన్నిచ్చే పచ్చిక బయలు కూడా ఉంది. అయితే ఈ సకల వసతుల మధ్య విద్యనభ్యసించేందుకు మాత్రం విద్యార్థులు లేరు. కర్ణాటకలోని షిమోగా జిల్లా తీర్థహళ్లి తాలూకా అరాగా పరిధిలోని జెడికుని గ్రామంలో ఈ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఒకే ఒక విద్యార్థిని సురశ్య, ఒకటో తరగతి చదువుతోంది. ఆమెకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు జయ కుమార్, నిత్యం తీర్థహళ్లి నుంచి వస్తూ, పోతుంటారు. గతేడాది దాకా ఐదుగురు విద్యార్థులుండేవారట. ఓ ఇద్దరు విద్యార్థులు ఐదో తరగతి పూర్తి చేసుకుని పోయారట. పోతూపోతూ, ఒకటి, మూడు తరగతుల్లోని తమ సోదరులను కూడా తీసుకెళ్లారట. దీంతో సురశ్య ఒక్కతే ఆ పాఠశాలలో మిగిలిపోయింది. స్థానికంగా పూజారిగా పనిచేసే ఆ బాలిక తండ్రి, సురశ్యను అక్కడే చదివిస్తున్నారట. ఇదిలా ఉంటే ఐదో తరగతి చదివే పిల్లలు మరో ఐదారు మంది గ్రామంలో ఉన్నప్పటికీ, వారంతా సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్నారు. ఇక తక్కువ మంది విద్యార్థులున్నారనే కారణంగా పాఠశాలలను ప్రభుత్వం మూసేస్తుందన్న ఆరోపణలను తిప్పికొట్టిన క్రమంలో ఆ పాఠశాలను మూయబోమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పిందట.

  • Loading...

More Telugu News