: వారానికి మూడు రోజుల పనిదినాలే మేలు: ప్రపంచ కుబేరుడి అభిమతమిదే!
82.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో మెక్సికోకు చెందిన 'టెలికాం టైకూన్' కార్లోస్ స్లిమ్ ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఫోర్బ్స్ తో కీర్తించబడుతున్నారు. అహోరాత్రులు శ్రమిస్తే ఏమొస్తుంది... నీరసం తప్ప! అంటున్నారు ఆయన. ఎందుకంటే ఏమాత్రం తీరిక లేకుండా పనిచేసే ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరచుకునే వెసులుబాటు లభించదట. ఉద్యోగుల పనితీరులో మరింత నాణ్యత రావటం, తద్వారా ఆయా సంస్థలు మెరుగైన వృద్ది సాధించాలంటే, వారానికి మూడు రోజుల పనిదినాలే మేలని ఆయన చెబుతున్నారు. ఇటీవల పరాగ్వేలో జరిగిన ఓ సదస్సులో పాల్పంచుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసి, అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అంతేకాందండోయ్, పదవీ విరమణ వయసును 75 ఏళ్లకు పెంచాలని కూడా ఆయన తన కొత్త ప్రతిపాదనను మనముందు పెట్టారు. వారానికి మూడు రోజుల పాటు పనిచేసే అవకాశముంటే, ఉద్యోగులు మరింత మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయనేది ఆయన వాదన. అయితే, మూడు రోజుల పనిదినాల్లో ఉద్యోగులు రోజుకు 11 గంటల చొప్పున పనిచేయాలని కార్లోస్ ప్రతిపాదించారు. ఈ తరహా పని విధానం తప్పనిసరిగా అమలవుతుందని చెప్పిన ఆయన, ఎప్పటిలోగా కార్యరూపం దాల్చనుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.