: అభిమాని అత్యుత్సాహానికి షాకైన హృతిక్ రోషన్
అభిమానుల అత్యుత్సాహం సినీనటులకు ఇక్కట్లు తెస్తోంది. హద్దులు దాటనంత వరకు అభిమానం బాగానే ఉంటుంది. అభిమానం పేరిట వికృత చేష్టలకు పాల్పడితే వారిని భరించడం చాలా కష్టం. తాజాగా బాలీవుడ్ ను బ్యాంగ్ బ్యాంగ్ చేస్తున్న హృతిక్ రోషన్ కు చేదు అనుభవం ఎదురైంది. మహాత్ముడి జయంతి రోజున ముంబైలోని పీవీఆర్ జుహూ మల్టీప్లెక్స్ లో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ప్రదర్శన సందర్భంగా పార్కింగ్ లాట్ లో ఇది చోటు చేసుకుంది. ఓ అభిమాని హృతిక్ రోషన్ మీదికి పరుగెత్తుకు వచ్చి అతని గొంతు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో హృతిక్ రోషన్ అంగరక్షకుడు మయూర్ అతడిని పట్టుకుని ఈడ్చిపడేశాడు. దీంతో ఆ ఆగంతుకుడు పారిపోయాడు. ఈ తరువాత హృతిక్ మాట్లాడుతూ, తమ ఉనికిని గుర్తించేందుకు అభిమానులు ఇలాంటి సాహసాలు చేస్తుంటారని, ఇదీ ఒక రకమైన అభిమానమేనని అన్నారు. తాను కోరుకునేది కూడా ఇలాంటి పిచ్చి అభిమానమేనని, తనకు అదే స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.