: మేము ప్రపంచంలోనే అత్యధిక సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం: బాబు
ప్రపంచంలోనే అత్యధిక సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ, రాయలసీమ జిల్లాల్లో సోలార్ ఎనర్జీకి భూములు సేకరించి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చొరవ తీసుకున్నామని ఆయన వివరించారు. ఇంటికి రెండేసి చొప్పున ఎల్ఈడీ బల్బులు కొనేందుకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల విద్యుత్ వాడకం తక్కువ అవుతుందని ఆయన వివరించారు. ఒప్పందాలు చేసుకుని విద్యుత్ లోటును పూడ్చుకున్నామని బాబు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే టీఆర్ఎస్ వాళ్లు ప్రతిరోజూ టీడీపీ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన వల్ల ఉత్పన్నమైన సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రతి రోజూ తమపై లేనిపోనివి ప్రచారం చేయడం, నిందలు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు. వాస్తవాలు వక్రీకరించి మాట్లాడడం సరికాదని ఆయన తెలిపారు. విమర్శిస్తే పెరిగిపోతామని భావించడం తప్పుడు ఆలోచన అని ఆయన అన్నారు. నాయకుల్ని తయారు చేసినప్పుడు వారిలో కొంత మంది స్వార్థపరులు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరిద్దరు లీడర్లు పార్టీని విమర్శించినంత మాత్రాని ఏమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రజల పక్షాన నిలిచింది కనుక ప్రజలున్నంత కాలం తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు.