: తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఉందని ప్రజలను మభ్యపెట్టారు: బాబు
రాష్ట్ర విభజన సరిగా జరగలేదని చెప్పినప్పుడు అందరూ తనను విమర్శించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిందే తానని అన్నారు. విభజనకు ముందు తెలంగాణలో అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఎవరి ప్రాపకమూ అక్కర్లేదని ప్రజలను మభ్యపెట్టారని ఆయన పేర్కొన్నారు. వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మిగులు ఎలా సాధ్యమైందో ఆయన వివరించారు. కేవలం నాలుగు నెలల్లోనే ఏపీ కోసం 900 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం తనపై అభాండాలు వేయడం సరికాదని ఆయన సూచించారు. కేంద్రం నుంచి వాటాలు తెచ్చుకోవడానికి వివిధ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం కనీసం సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. ముందు చూపుతో వ్యవహరించని కారణంగానే తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడిందని ఆయన వివరించారు. పీపీఏల్లో రెగ్యులేటరీ యాక్సెప్ట్ చేసిన ప్రకారం తాము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, రెగ్యులేటరీ కమిటీ కాదన్నవే తాను కూడా కాదన్నానని, లేని పక్షంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ లో ఇవ్వాల్సిన వాటాలను న్యాయంగా తెలంగాణకు ఇస్తున్నామని ఆయన తెలిపారు.