: దుశ్చర్యలు నిలిపేదాకా పాక్ తో చర్చల్లేవ్!
అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ సైన్యం పాల్పడుతున్న దుశ్చర్యలకు స్వస్తి పలికే దాకా ఆ దేశంతో చర్చలు లేవని భారత్ తేల్చి చెబుతోంది. నానాటికీ పెరిగిపోతున్న పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో భారత సరిహద్దు భద్రతా దళాలకు చెందిన స్థావరాలకు నష్టం వాటిల్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి పాక్ కాల్పుల్లో పలువురు సైనికులతో పాటు పౌరులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ తో మరింత కఠినంగా వ్యవహరించడం మినహా ప్రత్యామ్నాయమేదీ లేదని భారత సైనిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక కేంద్రంలోని కీలక పెద్దలు కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అయితే ‘త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి’ అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ ఆ దేశంపై అంత మెతకగా వ్యవహరించాల్సిన అగత్యమేమీ లేదని కూడా ప్రభుత్వ, సైనిక వర్గాలు భావిస్తున్నాయి. పాక్ తన వైఖరిని మార్చుకునేదాకా చర్చలను నిలిపేయడమే మేలని కూడా ఆ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.