: క్షమించండి... ఈ స్థాయి స్పందన ఊహించలేకపోయాం: ఫ్లిప్ కార్ట్
'బిగ్ బిలియన్ డే' పేరిట నిర్వహించిన సేల్ స్కీంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫ్లిప్ కార్ట్ స్పందించింది. కొనుగోలుదారులకు క్షమాపణలు చెప్పింది. అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యామని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. తమ ఆఫర్ కు ఇంతటి స్పందనను ఊహించలేకపోయామని తెలిపింది. తమ సంస్థ ద్వారా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న కోట్ల మంది వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయినందుకు ఫ్లిప్ కార్ట్ క్షమాపణలు తెలిపింది. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అనుభవంతో మరోసారి మెరుగ్గా నిర్వహిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంతటి భారీ స్పందనను ఊహించకపోవడంతో సరైన ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమయ్యామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అవసరానికి తగినంత స్టాక్ ను కూడా అందుబాటులో ఉంచుకోలేకపోయామని ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ వినియోగదారులకు సంయుక్తంగా మెయిల్ చేశారు. వినియోగదారులు వెల్లువెత్తడంతో వెబ్ సైట్ సర్వర్ పై ఒత్తిడి పెరిగి పలు మార్లు క్రాష్ అయిందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు షాపింగ్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు. తమపై కస్టమర్ల నమ్మకం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు ప్రకటించారు. అవుటాఫ్ స్టాక్ సమస్యను కూడా తగ్గించుకుంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు.