: వ్యక్తికి ఇది ప్రధాన శత్రువు, తొలగించుకోండి ఇలా..!


ఈర్ష్య... వ్యక్తుల నడతకు సంబంధించిన లోపాల్లో ముఖ్యమైనది, ప్రమాదకరమైనది కూడా! స్నేహితులు విడిపోతారు, ప్రేమికుల మధ్య అంతరం పెరుగుతుంది, వైవాహిక బంధం విడాకులకు దారితీస్తుంది. కారణం... ఈర్ష్యే. దీన్నే ఆంగ్లంలో జెలసీ అంటారు. జెలసీ అంటే ఆత్మన్యూనత భావం తప్ప మరోటి కాదు. ఎదుటివారి కంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, తద్వారా, ఎదుటివారిపై ద్వేషభావం పెంచుకోవడం... ఇదే ఈర్ష్య అంటే! ఈ దుర్గుణం వ్యక్తి ఎదుగుదలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలంలో పతనం అంచులకు చేర్చుతుంది. ఈ వ్యక్తిత్వ లోపాన్ని అధిగమించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ ముఖర్జీ కొన్ని విలువైన సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. కొందరు తమను ప్రతి ఒక్కరితో పోల్చుకుంటూ ఉంటారు. దానర్థం, వారిని వారు తక్కువ చేసుకోవడమే. మీ భాగస్వామి మీ చెంత ఉందంటే ఆమె/అతడు మీ సొంతమనే. అలాగని అన్ని వేళలా భాగస్వామి మదిలో మీరే ఉండాలనుకోవడం సరికాదు. ఇతరుల గురించి చర్చించే అవకాశం భాగస్వామికి ఇవ్వాలి. మీ విషయాలు కాకుండా, మరెవ్వరి విషయాలను చర్చిస్తున్నా సావధానంగా వినడం అలవర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించడం మానుకోవాలి. మీరు ఫోన్ చేసిన సమయంలో మీ భాగస్వామి వారి ఆఫీసు బాస్ తోనో, మరెవరైనా మిత్రులతోనో మాట్లాడుతూ ఉండవచ్చు. ఆమె/అతడు ఎవరితో మాట్లాడుతున్నారన్న విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అలాంటి విషయాలు తెలుసుకోవడం ప్రాక్టికల్ గా కొన్నిసార్లు సాధ్యం కాదు కూడా. వీటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే, కాసేపాగి ట్రై చేయడం మంచిది. ఇలాంటి సమయాల్లో మనసును ఇతర పనులపై లగ్నం చేయడం ఉత్తమం. జీవితమన్నాక ఒంటరితనం కొన్నిసార్లు అనుభవంలోకి రాకతప్పదు. అయితే, ఆ ఒంటరితనాన్ని అధిగమించడమూ ముఖ్యమే. భాగస్వామితో గొడవలు మామూలు విషయం. వాదన ఆధారంగా మీ భాగస్వామిని అంచనా వేయడం పొరపాటు. ఆవేశంలో ఏవో మాట్లాడతారు. వాటిని పట్టించుకోనవసరంలేదు. ఇలాంటి సమయాల్లో ఒంటరిగా కొంచెం దూరం వాకింగ్ కు వెళ్ళడం ఆత్మపరిశీలనకు ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకోనవసరంలేదు. భాగస్వాముల మధ్య కొంచెం ఎడబాటు కూడా అవసరం. అనుబంధంలో కాసింత విరామాన్ని కూడా లాభదాయకంగా మలుచుకోవచ్చు. మీరు మీ స్నేహితులను కలుసుకోవచ్చు, మీ భాగస్వామిని కూడా తన శ్రేయోభిలాషులను కలుసుకునేలా ప్రోత్సహించవచ్చు. మీ భాగస్వామి విశ్వసనీయతపై అనుమానం వస్తే, సాధ్యమైనంత సామరస్యపూర్వకంగా నివృత్తి చేసుకునేందుకు యత్నించండి. ఆ సందేహం మీ భ్రాంతి కావచ్చేమో! అర్థంలేని ఆలోచనలు మనిషిని డిప్రెషన్ లోకి నెడతాయి. జీవితం సాధారణమైనది అనుకుంటే, దాన్ని అనారోగ్యకర ఆలోచనలతో సంక్లిష్టం చేసుకోకండి. మీ పట్ల మీరు నమ్మకం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు దేవుడి అద్భుత సృష్టి అని భావించుకోండి. తద్వారా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నైతిక స్థయిర్యం మీ సొంతమవుతుంది.

  • Loading...

More Telugu News