: మెరిసే మేని కోసం కలర్ ఫుల్ డైట్!
కొందరికి వయసు పైబడుతోందంటే భయం! మరికొందరు జుట్టు తెల్లబడుతోందన్నా, ముఖంపై ముడతలు వస్తున్నా ఆందోళనకు గురవుతారు. కాస్త ఎండలో తిరిగితే చాలు, ముఖం నల్లబడిందేమోనని ఎన్నెన్నో క్రీములు వాడతారు. అయితే, అవేవీ అవసరం లేకుండా నిర్దిష్ట ఆహారంతో చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవచ్చంటున్నారు నిపుణులు. సంతులిత ఆహారం తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందని వారు చెబుతున్నారు. హానికరం కాని కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు... వీటితో మెరిసే మేని సొంతమవుతుందట. ఈ విషయమై ప్రఖ్యాత డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆకృతి మెహ్రా ఏమంటున్నారో వినండి. ప్రత్యేక డైట్ తీసుకోవడం ద్వారా శరీరానికి తగు పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడాంట్లు అందుతాయని, తద్వారా, చర్మం కాంతిమంతంగా మారుతుందని చెప్పారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నుపుర్ కృష్ణన్ దీనిపై మాట్లాడుతూ, రంగురంగుల ఫలాలు, కాయగూరలు తీసుకోవడం ద్వారా మేని వర్ణంలో మార్పు వస్తుందని, చర్మం ముడతలు పడదని తెలిపారు. టమోటాలు, రెడ్ బెల్ పెప్పర్స్, విటమిన్ సి పుష్కలంగా లభించే అన్ని రకాల సిట్రస్ ఫలాలు, చిలగడ దుంపలు, కెరోటినాయిడ్లు సమృద్ధిగా లభించే కూరగాయలను డైట్ చార్ట్ లో చేర్చాలని నుపుర్ సూచిస్తున్నారు. ఇక, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ అనూప్ ధీర్ మాంసాహారులకు పలు సూచనలు చేశారు. ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసం, సాల్మన్, టూనా వంటి కొవ్వుండే చేపలు, గుడ్లు తీసుకోవడం ద్వారా నాన్-వెజిటేరియన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు. టమోటాలు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, ఆరెంజ్, ద్రాక్ష, అరటి, అవకాడో, ఆపిల్ పండ్లను క్రమం తప్పకుండా స్వీకరిస్తే, వాటిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడాంట్లు చర్మంలోని మృతకణాలను తొలగించి, మేనికి కొత్త కాంతినిస్తాయని నిపుణులు అంటున్నారు.