: నటి సమంత సంఘసేవ
అనాథ పిల్లలకు 'హెపటైటిస్ బి' తొలి విడత వ్యాక్సిన్ వేసేందుకు హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో నటి సమంత పాల్గొంది. తన ప్రత్యూష స్వచ్ఛంద సేవాసంస్థ తరపున సమంత ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా, కాంటినెంటల్ ఆసుపత్రి సిబ్బందితో కలసి అనాథ బాలలకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా 25 మంది చిన్నారులకు ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేశారు. అనంతరం సమంత మాట్లాడుతూ, హెపటైటిస్ బి జబ్బును అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలిపింది. పిల్లలకు మూడుసార్లు వ్యాక్సినేషన్ చేయిస్తే జీవితాంతం ఈ ప్రమాదకర వ్యాధికి దూరంగా ఉండవచ్చని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రశంసించింది.