: నాగార్జున, సానియా మీర్జాలను సవాల్ చేసిన రిలయన్స్ గ్రూపు చైర్మన్
కేంద్రం ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమం ఊపందుకుంటోంది. చీపురు పడుతున్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి మరికొందరు ప్రముఖులను నామినేట్ చేస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపందుకుని ఈ ఉదయం చీపురు పట్టిన రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ముంబయిలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ బయట శుభ్రం చేశారు. అనంతరం, పలువురికి సవాల్ విసిరారు. అనిల్ అంబానీ నామినేట్ చేసిన వారిలో టాలీవుడ్ హీరో నాగార్జున, టెన్నిస్ తార సానియా మీర్జా ఉన్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషిచేస్తానని తెలిపారు. కాగా, అనిల్ అంబానీ చీపురు పట్టడంపై ప్రధాని మోడీ ట్విట్టర్లో స్పందించారు. ఇతరులతో కలిసి అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మంచి ప్రయత్నమని ప్రశంసించారు.